రజతోత్సవ సభకు సైన్యంలా కదలాలి
కేటీదొడ్డి: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు అధ్యక్షతన కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో రజతోత్సవ సభకు సంబందించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం మాజీ సీఎం కేసీఆర్.. పదవులనే లెక్కచేయలేదని, చావుదాక వెళ్లి రాష్ట్రాన్ని సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ సార్కారు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం పాత సీసాలో కొత్తసారా..లాగానే ఉందన్నారు. రైతుల భూముల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్‌ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి ఫొర్టల్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయని అన్నారు. అంతకుముందు మండలంలోని వెంకటాపురం శ్రీపాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చక్రదర్‌రావు, వెంకటేష్ నాయుడు, మోనేష్, శేఖర్ నాయుడు, రామునాయుడు, మాక్బూల్, తిరుమల్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.


