
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
మల్దకల్: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో గట్టు అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందే పౌష్టికాహారంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. నెలనెలా వైద్యపరీక్షలు చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సంధ్యారాణి, నాగరాణి, తెల్లమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.