
గద్వాల రూరల్: స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన నేటికి మహిళలపై వివక్షత కొనసాగుతూనే ఉందని, వ్యవసాయ అనుబంధ రంగ మహిళా కూలీలు జీవనోపాధి, హక్కు, భద్రత, సామానత్వ సాధన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్షను అరికట్టాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ, వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8నుండి గ్రామీణ ప్రాంతాల్లో మహిళ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి హక్కులపై, ఎదుర్కొంటున్న సమస్యలపై తహసీల్దార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో లావణ్య, శృతి, మహేశ్వరి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు260 మంది గైర్హాజరు
గద్వాల: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు మొత్తం 4,559 మంది విద్యార్థులకుగాను 4,299 మంది హాజరయ్యారు. 260 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.ఇక జనరల్ విభాగంలో 3,793 మంది విద్యార్థులకుగాను 3,584 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 766 మంది విద్యార్థులకుగాను 715 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్య జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 144 సెక్షన్‌ను ఆయా కేంద్రాల వద్ద అమలు చేశారు.
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మల్దకల్: ఎత్తు, బరువు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వరకు అన్ని గ్రామాల్లో అంగన్ వాడీ టీచర్ల పోషణ పక్షం వారోత్సవాలు నిర్వహించాలని సీడీపీఓ కమలాదేవి అన్నారు. సోమవారం మల్దకల్ రైతు వేదికలో మల్దకల్, గట్టు, అయిజ మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అదేశాల మేరకు మార్చి 20 నుంచి జూన్ 6 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే అంగన్‌వాడీ సెంటర్లను నిర్వహించాలన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, అలాగే గర్భిణులు, బాలింతలకు వచ్చిన పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. జిల్లా పోషన్ అభియాన్ కోఆర్డినేటర్ కళ్యాణ్ రెడ్డి, అంగన్‌వాడీ సూపర్ వేజర్లు నాగరాణి, వాసంతి, బాలమ్మ, తెల్లమ్మ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,670
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 3,525 క్వింటాళ్ల వేరుశనగ రాగా క్వింటాకు గరిష్టం రూ.6,670, కనిష్టం రూ.3,240, సరాసరి రూ.5,770 ధరలు లభించాయి. అలాగే, 284 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.6,172, కనిష్టం రూ.2,812, సరాసరి రూ.6,009 ధర పలికింది. 10 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ. 7,834, కనిష్టం రూ.7,804, సరాసరి రూ.7,812 ధరలు పలికాయి. 52 క్వింటాళ్ళ ఎండుమిర్చి రాగా గరిష్టం రూ. 22,200, కనిష్టం రూ. 15,000, సరాసరి రూ. 17,500 ధరలు వచ్చాయి.
