ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు ద్వితీయ భాష (సెకండ్‌ లాంగ్వేజ్‌) పేపర్‌–1 పరీక్షకు 437 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 413 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ వెంకన్న తెలిపారు. పేపర్‌–1 పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పరీక్ష సమయానికి అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షకు మొత్తం 78 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 73 మంది పరీక్ష రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు.

ప్రశాంతంగా పాలిసెట్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సంఘమిత్ర డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో మొత్తం 905 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 842 మంది పరీక్ష రాసినట్లు పాలిసెట్‌ జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.రమణారావు తెలిపారు. 63మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల వద్దకు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. దూరప్రాంతాలకు చెందిన పిల్లలను ద్విచక్రవాహనాలు, ఆటోల ద్వారా వారి తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. పరీక్ష ముగిసే వరకు తల్లితండ్రులు పరీక్ష కేంద్రాలకు సమీపంలోనే పలు దుకాణాల ముందు, చెట్ల నీడకు వేచి చూశారు.

Advertisement
 
Advertisement
Advertisement