డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఇక కఠినతరం
● రోడ్డు భద్రతపై మరింత అవగాహన
● త్వరలో మార్గదర్శకాలు
భూపాలపల్లి అర్బన్: డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై కఠినతరం కానుంది. లైసెన్స్ జారీ కోసం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితం ఆధారంగా లైసెన్స్ జారీ చేస్తారు. ప్రధానంగా డ్రైవింగ్ నైపుణ్యం పెంచడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, వీలైనంత మేర రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రోడ్డు ప్రమాదాలు నూరు శాతం తగ్గాలంటే రోడ్డు భద్రతపై ప్రతీ ఒక్కరికి అవగాహన తప్పనిసరి. ప్రస్తుతం దరఖాస్తుదారులకు ఎల్‌ఎల్‌ఆర్, శాశ్వత డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లైసెన్స్ జారీ చేస్తున్నారు. వీటికి అదనంగా రోడ్డు భద్రతపై ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.
6 విభాగాలుగా పరీక్షలు
మూడు గంటల నిడివితో ఉండే ఈ పరీక్షలను ఆరు విభాగాలుగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 30నిమిషాల సమయం ఉంటుంది. పరీక్షలు రాసిన వారికి ఒక సర్టిఫికెట్ నంబర్ కేటాయించి దాని ఆధారంగా లెర్నర్ డ్రైవింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అర్హత కల్పిస్తారు. ఈ మాసం నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని భావిస్తున్నా, ప్రభుత్వం నేటికీ ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఈ విధానం అమలులోకి రానుంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు..
ప్రతీ రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం కారణంగా క్షతగాత్రులు కావడం లేదా రోడ్డు ప్రమాదంలో మరణించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ జారీని కఠినతరం చేయనున్నారు. రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ నూతన లైసెన్స్‌ల జారీకి శ్రీకారం చుట్టనున్నాయి. రోడ్డు ప్రమాదాలతో పలు కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలామంది డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నూతన విధానం అమలుచేయనుంది. నూతనంగా ఆన్‌లైన్ రోడ్డు సేప్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన సామగ్రిని కూడా రవాణాశాఖ సమకూర్చుకోనుంది.
మార్గదర్శకాలు
రాగానే అమలు..
రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ నూతన డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం అమలు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ మరింత కఠినతరం చేసేందుకు మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. పకడ్బందీగా, పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోడ్డు భద్రతాపై అవగాహన కల్పించేందుకు కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీచేస్తాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
– సంధాని, జిల్లా రవాణాశాఖ అధికారి
లైసెన్స్ కోసం..
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం మూడు దశల విధానాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తు చేయడానికి ముందే అభ్యర్థులు మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా అవగాహన మాడ్యూల్స్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండో దశలో లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ టెస్ట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష రాసి లైసెన్స్ పొందాలి. మూడో దశలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం సంబంధితశాఖ కార్యాలయంలో ట్రాక్‌పై నిర్వహించే ప్రాక్టికల్ టెస్ట్‌కు హాజరై నైపుణాన్ని నిరూపించుకున్న తరువాత లైసెన్సును జారీచేస్తారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ జారీకి పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నా, ప్రభుత్వం రోడ్డు భద్రతపై కీలక నిర్ణయం తీసుకోవడంతో నూతన విధానం అమలులోకి రానుంది. ఈ విధానంతో మరింత పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేకుండానే ప్రమాదాలకు కారకులు అవుతున్న వారికి ఇక నుంచి లైసెన్స్ జారీ చేయడంలో కఠినంగా వ్యవహరించనుంది. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది అంత సులభతరం కాదని తెలుస్తోంది. కొత్తగా రానున్న నిబంధనల కారణంగా లైసెన్స్ పొందే వారికి రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


