● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి రూరల్: నాణ్యమైన వైద్యసేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న హెల్త్ వీక్ కార్యక్రమంపై వైద్య, విద్య, సంక్షేమ శాఖలు, ఫుడ్ సేఫ్టీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వైద్యశాఖతో పాటు విద్యా, సంక్షేమ శాఖలు, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ఆరోగ్య వారాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మండల, గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చేయాలని స్పష్టంచేశారు. 6వ తేదీ ఉదయం ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డేతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి, డీపీఓ శ్రీలత, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ప్రధాన ఆస్పత్రి ఉప పర్యవేక్షకులు డాక్టర్ వెంకటరత్నం, ఆహార తనిఖీ అధికారి వరుణ్ రెడ్డి, ఈడీఎం శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


