భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా పలువురి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. భూపాలపల్లి తహసీల్దార్‌గా పి.లక్ష్మీరాజం, వై.శ్రీనివాసులు (కలెక్టర్ కార్యాలయం), ఎన్.హేమ (కొత్తపల్లిగోరి), విజయలక్ష్మి (కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం), సత్యనారాయణ (మహదేవపూర్), రామారావు (కలెక్టర్ కార్యాలయం), రాజేశ్వర్‌రావు (పలిమెల), స్వరూపరాణి (కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్, టేకుమట్ల తహసీల్దార్), రాజేశ్వర్‌రావు (గణపురం) తహసీల్దార్లుగా నియమించారు. చిట్యాల డిప్యూటీ తహసీల్దార్‌గా అనిల్ (చిట్యాల), ఇమాం బాబాషేక్ (మహాముత్తారం), సందీప్ (మల్హర్)లను కలెక్టర్ బదిలీ చేశారు.
రామప్ప శిల్పకళ బాగుంది
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని పీసీసీఎఫ్– చీఫ్ వైల్డ్‌లైఫ్ అధికారి వినయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కాళేశ్వరం సీపీఎఫ్ ప్రబాకర్, ములుగు డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీఓ సత్తయ్య, ఎఫ్‌ఆర్‌ఓ శంకర్, డీఆర్‌ఓ మధు బాబు, ఎఫ్‌బీవో కిషన్ తదితరులు ఉన్నారు.
రామప్పలో మఠాధిపతి నాగమహర్షి,
కెనడాకు చెందిన హరిదాస్
రామప్ప దేవాలయాన్ని శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం నాగమఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కాలనాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్‌తో కలిసి శనివారం రామప్పను సందర్శించారు. భూపాలపల్లి జిల్లా నందిగామ మహాకాళేశ్వర దేవస్థానానికి హరిదాస్ రాగా మఠాధిపతి అయిన నాగమహర్షి హరిదాస్‌ను తీసుకుని రామప్ప ఆలయానికి వచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని వారు కొనియాడారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందడి నెలకొంది.
‘విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి’
ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని డిగ్రీ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బాలయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో జాకారంలోని ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దాసరి సమత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు యూనిఫాం లేని సైనికులని తెలిపారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సహనశీలత, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. ఈ శిబిరం నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ –ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జాకారం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు.


