హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్‌ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్‌వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్‌పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, శ్రీధర్ పాల్గొన్నారు.
టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్


