జీపీల్లో పన్ను బకాయిలు రూ.4.25 కోట్లు
భూపాలపల్లి: రేపటితో మార్చి నెలాఖరు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కూడా గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూలు నూరుశాతం కాలేదు. జిల్లావ్యాప్తంగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు పేరుకుపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ప్రభావం పడనుంది.
జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల నుంచి ఈ ఏడాది ఆస్తి, నల్లా పన్ను రూపేణా రూ. 4.25 కోట్ల వసూలు కావాల్సి ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రూ. 2.93 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా సుమారు రూ.1.32 కోట్లు బకాయి ఉంది. రేపటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఒక్కరోజే ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం అధికారులకు శక్తికి మించిన పనిలా మారింది.
అంతగా పెరగని డిమాండ్..
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అంతంత మాత్రంగానే డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో పాత పెంకుటిళ్ల స్థానంలో కొత్త భవనాలు వెలిశాయి. అయినప్పటికీ చాలా గ్రామాల్లో రికార్డుల్లో మాత్రం పాత ఇళ్లే ఉన్నాయి. ఆన్‌లైన్ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు పొంతన లేకపోవడంతో పన్ను డిమాండ్ పెరగలేదు. ఉన్న డిమాండ్‌ను వసూలు చేయడమే కష్టంగా మారిన తరుణంలో, కొత్తగా అసెస్మెంట్ చేయకపోవడం ఆదాయానికి గండి కొడుతోంది.
పని ఒత్తిడిలో కార్యదర్శులు..
పంచాయతీ కార్యదర్శులు కేవలం పన్నుల వసూళ్లకే పరిమితం కాకుండా పారిశుద్ధ్యం, ఉపాధి హామీ తదితర పనుల పర్యవేక్షణలో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడంతో కార్యదర్శులంతా ఎన్నికల బీజీలో ఉండటం కూడా పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది.
వసూలు రూ.2.93 కోట్లు మాత్రమే


