భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందాలనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మూలుగుతున్న దరఖాస్తులు
దరఖాస్తులు సమర్పించి సుమారు ఏడాది గడుస్తున్నా పథకం అమలు కాకపోవడంతో మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు కంప్యూటర్లకే పరిమితమయ్యాయి. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల నుంచి రూ 4లక్షల వరకు రుణాలు పొందేందుకు జిల్లాలోని 12 మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, నివాసం, ఆదాయం, తదితర సర్టిఫికెట్ల కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి, వారాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి, కోటి ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఈ పథకం గురించి ఊసే ఎత్తడం లేదని, దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ఆరంభంలో బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ ఉన్నవారికి రుణం మంజూరు చేయాలని, నిబంధనను ప్రభుత్వం మొదట ప్రవేశపెట్టింది. దీంతో యువతీ యువకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిబిల్ స్కోర్ అనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ప్రభుత్వం పథకం గురించి ఊసే ఎత్తకపోవడంతో తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇప్పట్లో కేటాయింపులు లేనట్లేనా?
అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. రూ.50వేల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారికి యూనిట్లను కేటాయించాలనుకున్న ప్రభుత్వం వెనకడుగు వేసింది. యూనిట్ల కేటాయింపు ప్రక్రియను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటినుంచి దరఖాస్తుదారులు యూనిట్ల కేటాయింపు కోసం నిరీక్షిస్తున్నారు.
నూతన బడ్జెట్ అమలయ్యేనా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.6వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. గతంలో కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధులను సైతం అమలు చేయకపోవడంతో నిరుపేద నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసానికి కేటాయించిన బడ్జెట్ సైతం అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రుణాలు అందించాలి..
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని ఏడాది కావస్తుంది. అధికారులు విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంతో కార్పొరేషన్ రుణాలకు సైతం అనేక మార్లు దరఖాస్తులు చేసుకున్నాం. రుణాలు మాత్రం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలి.
– మత్స్య శ్రీకాంత్, దరఖాస్తుదారుడు టేకుమట్ల
దరఖాస్తుల సంఖ్య..
ఎస్సీలు
6,711
బీసీలు
11,225
మైనారిటీలు 749
ఈబీసీలు
401
క్రిస్టియన్లు
9


