● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. కొరత లేదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సంకీర్త్‌తో కలిసి కలెక్టర్ జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డీటీలు, ఎస్సైలు పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్డీఓకు సూచించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మి ఆందోళన చెందొద్దని ఎస్పీ సంకీర్త్ సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించామని చెప్పారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల వద్ద పటిష్ట నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్‌పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ పాల్గొన్నారు.


