రాజీమార్గంలో వివాదాల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గంలో వివాదాల పరిష్కారం

Mar 29 2026 7:22 AM | Updated on Mar 29 2026 7:22 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు

భూపాలపల్లి అర్బన్‌: నైతిక విలువలు పాటిస్తూ రాజీమార్గంలో ముందుకు సాగితే వివాదాలకు తావులేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరభావంతో కలిసి జీవిస్తే వివాదాలు తలెత్తవని తెలిపారు. చిన్నచిన్న విభేదాలను పెంచుకుని కోర్టులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు, మనశ్శాంతి నష్టమవుతాయని హెచ్చరించారు. ప్రజలు రాజీమార్గాన్ని ఎంచుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా ఇరువర్గాల అంగీకారంతో కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాజ్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌నాయక్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌ బొట్ల సుధాకర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏదులాపురం శ్రీనివాస్‌, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

బాలుడికి న్యాయం, రూ.15 లక్షల పరిహారం

చిట్యాల మండలం చింతకుంటరామయ్యపల్లెకు చెందిన మోత్కూరి మణిదీప్‌ అనే ఆరు సంవత్సరాల బాలుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఘటనలో లోక్‌ అదాలత్‌ ద్వారా న్యాయం జరిగింది. మొగుళ్లపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో అతని తాతయ్య మరణించగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు బాలుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశించారు.

ఏడేళ్ల భూ వివాదం పరిష్కారం

టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు అంతటి స్వామి, అంతటి తిరుపతి మధ్య భూమి పంపకాలపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైంది. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌నాయక్‌ సమక్షంలో ఇరువురు రాజీకి వచ్చి కేసును ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement