నెగ్గి తగ్గిన కారు.. | - | Sakshi
Sakshi News home page

నెగ్గి తగ్గిన కారు..

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

నెగ్గి తగ్గిన కారు..

నెగ్గి తగ్గిన కారు..

అధికార కాంగ్రెస్‌కు తీవ్ర పోటీ

పక్కా ప్రణాళికతో

కాంగ్రెస్‌కు 16 స్థానాలు

రెండు స్థానాలతోనే

సరిపెట్టుకున్న కమలం

తప్పిన కమ్యూనిస్టుల గురి..

ఒక్క స్థానానికే పరిమితం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఏకై క మున్సిపాలిటీని ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ కై వసం చేసుకునేందుకు రెండు నెలల నుంచి పక్కా ప్రణాళికతో ముందువెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అధికార పార్టీకి దీటుగా అభ్యర్థులను బరిలో దింపి ప్రచారం నిర్వహించింది. గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు దీటుగా వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. బీజేీపీ ఎప్పటి లాగే రెండు స్థానాలకే పరిమితమైంది. కార్మిక కాలనీల్లో పట్టున్న వామపక్షాలు సైతం ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లతో పోలిస్తే ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీల ఓట్ల సంఖ్య తగ్గింది.

తిరుగులేని కాంగ్రెస్‌

ఎన్నికలు ఏవైనా ఫలితం మాత్రం ఒకటే కాంగ్రెస్‌ విజయం. భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. మొత్తం 30 వార్డుల్లో 16 వార్డులు గెలుచుకుని మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. మున్సిపాలిటీలో త్రిముఖ పోరు నెలకొన్నా కాంగ్రెస్‌ మాత్రం ఏకపక్షంగా మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొదటి సారిగా కాంగ్రెస్‌ జెండా ఎగరవేసింది. అధికార పక్షం కావడంతో కాంగ్రెస్‌కు ఎదురులేకుండా పోయింది. ముందు నుంచి కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. వార్డుల వారీగా గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై సర్వేచేసి వారికే టికెట్‌ కేటాయించింది. ఏ వార్డులో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఎక్కువగా ప్రచారం చేసింది. మరో మూడు వార్డుల్లో అతివిశ్వాసంతో ఓడిపోయామని కాంగ్రెస్‌ చెబుతోంది.

గట్టిపోటీనిచ్చిన బీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ పోరు ప్రారంభమైనప్పటి నుంచి పట్టణ ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే పురపోరు సాగింది. కాంగ్రెస్‌ 25, వామపక్షాలు 5 వార్డుల్లో పోటీ చేయగా ప్రతి వార్డులో తీవ్ర పోటీ నిచ్చింది. 4వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీని మూడో స్థానంలోకి తొక్కింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండు నెలల నుంచి మున్సిపల్‌ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ వార్డులో ఒక్కటి రెండు సార్లు బస్తీ బాట నిర్వహించారు. రెండు మూడు సార్లు గండ్ర దంపతులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు.

వికసించని కమలం

నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి మున్సిపల్‌ ఎన్నికలు చేదు ఫలితాలనిచ్చాయి. కేవలం రెండు వార్డులను కై వసం చేసుకుంది. 14వ వార్డులో రెండో స్థానంలో నిలవగా.. 22 వార్డుల్లో మూడో స్థానంలో నిలిచింది. 2015లో రెండు స్థానాలు 2020లో ఒక కౌన్సిలర్‌ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి రెండు స్థానాలకు పరిమితమైంది. పక్కాగా ప్రచారం చేసినా.. చాలా వార్డుల్లో ప్రజలు ఆదరించకపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌లను తీసుకువచ్చి కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. అయినా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్న వార్డుల్లోనూ ఓడిపోవడం ఆ పార్టీని విస్మయానికి గురిచేస్తుంది.

పట్టు తప్పుతున్న కమ్యూనిస్టులు

గతంలో భూపాలపల్లి పట్టణంలో సీపీఐ, సీపీఎంలకు పట్టు ఉండేది. పార్టీల అనుబంధ సింగరేణి కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ ఉన్నాయి. ప్రధానంగా ఏఐటీయూసీకి కార్మికుల్లో బలం ఉంది. గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఐఎన్‌టీయూసీకి తీవ్రమైన పోటీనిచ్చింది. గత రెండు పర్యాయాలు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకటి, రెండు చొప్పున కమ్యూనిస్టులు గెలిపొంది అధికార బీఆర్‌ఎస్‌కు తీవ్ర పోటీని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి సీపీఐ 4, సీపీఎం 1 స్థానంలో పోటీ చేయగా 24 వార్డులో మాత్రమే సీపీఐ గెలుపొందింది. 28వ వార్డు సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement