కేయూలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం!
● 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు
● వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్‌టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్‌వైజ్‌గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
100 మంది నియామకం..
కేయూపరిధిలో 130 మంది పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే..
కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్‌లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. నోటిఫికేషన్ వస్తే ఎంతమందిని నియమిస్తారనే వివరాలు తెలియనుంది. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు.
కేయూలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం!


