నేటినుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
కల్యాణ వేదిక చిన్నది..
మండపం పెద్దది!
కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నేటి (శనివారం) నుంచి సోమవారం వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఉత్సవాలకు భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా తరలిరానున్నారు. 14న శనివారం ఉదయం 10గంటలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ, రుత్విగ్వరణం, మృత్సంగ్రహణం, 11 గంటలకు దేవతారాధన, నవకలశారాధన, నవగ్రహారాధనం నిర్వహిస్తారు. 11.30 గంటలకు మండప దేవతారాధన, వృషభ ధ్వజారోహణం చేపడుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు, ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ప్రసిద్ధ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కాటకలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ శుభానంద–ముక్తీశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం నా లుగువేల మంది కూర్చునేలాగా నిర్మించారు. కానీ కల్యాణం జరిగే వేదిక మాత్రం చిన్నగా ఉందని విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. వెనుకవైపు కూర్చునే వారికి కల్యాణం తంతు కనపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు రెండు వైపులా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
కాళేశ్వరంలో కల్యాణమహోత్సవం
భారీగా తరలిరానున్న భక్తులు


