ఓటెత్తారు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎన్నికలు
పోలింగ్ సరళి ఇలా..
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
34,367 మంది ఓటు హక్కు వినియోగం..
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, పురుష ఓటర్లు 26,786, మహిళ ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు, మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 34,367 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 65.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
యువత ఆసక్తి..
ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత ఆసక్తి చూపారు. పలువురు తల్లులు చంటిబిడ్డలను ఎత్తుకొని రాగా, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ..
ఎన్నికల సరళి, ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పోల్ చీటీలు లేక ఇబ్బందులు..
పలువురు ఓటర్లకు పోల్ చీటీలు అందక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల రోజునే కొందరు వివిధ రాజకీయ పార్టీల వద్ద పోల్‌చీటీలు పొందగా, మరికొందరు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బీఎల్‌ఓల వద్ద తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెరిగిన పోలింగ్ శాతం
భూపాలపల్లి మున్సిపాలిటీలో 2020లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి 1.81 శాతం పోలింగ్ పెరి గింది. కాగా అత్యధికంగా 2014లో 70.55 శాతం పోలింగ్ జరిగింది. అనంతరం 2020లో 63.37 శాతం పోలింగ్ జరుగగా, బుధవారం జరిగిన ఎన్నికల్లో 65.18 శాతం పోలింగ్ నమోదైంది.
స్ట్రాంగ్ రూమ్‌కు తరలిన బ్యాలెట్ బాక్సులు..
పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. రేపు (శుక్రవారం) ఓట్ల లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు.
మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా 107 మంది అభ్యర్థలు బరిలో ఉన్నారు. ఇందులో స్వతంత్రులు అంతంత మాత్రంగానే ఉనికి చాటుకోబుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు పార్టీలు చెరో 10 స్థానాలను పక్కాగా కై వసం చేసుకోనుండగా మిగిలిన పదింటిలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానాల్లో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కుతారు. అయితే ఈ వార్డుల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కై వసం చేసుకుంటే ఆ పార్టీనే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునే అవకాశం ఉంది.
ఓటర్లకు డబ్బులు పంచుతూ పలువురు పట్టుబడ్డారు. 22వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షల స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3వ వార్డులో డబ్బులు పంచేందుకు వెళ్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ. 7,500 స్వాధీనం చేసుకున్నారు.
చెదురు ముదురు ఘటనలు..
6వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్‌లో ఇతర ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను పంపించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన బీఎల్‌ఓలకు భోజన సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
65.18 శాతం పోలింగ్ నమోదు
పోల్ చీటీలు అందక
పలుచోట్ల ఇబ్బందులు
పోలింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్
రేపు కౌంటింగ్..ఫలితాల వెల్లడి
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..


