మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖకు సూచించారు. దేవాలయం, అన్నదాన సత్రాలు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. 15న సరస్వతీ ఘాట్ వద్ద జరిగే తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ఆలయంలో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. మహదేవ్‌పూర్, కాటారం, భూపాలపల్లి మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలను నిషేధించాలన్నారు. పరిశుభ్రత, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 104, 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం స్టాండ్‌బైలో ఉంచాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్చన టిక్కెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని దేవస్థాన ఈఓకు సూచించారు. 14 నుంచి 16 వరకు కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో వైన్‌షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత
కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ రాహుల్ శర్మకు బుధవారం ఆలయ ఈఓ, పూజారి ఆహ్వానపత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, అర్చకులు కలెక్టర్‌కు మహాశివరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను వివరించి, ఈ నెల 15 తేదీన నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, జాగరణ, రథోత్సవం తదితర వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందించారు.
ప్రత్యేక బస్సులు
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం ఇందు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


