ఎన్నికల విధులు అత్యంత కీలకం
భూపాలపల్లి : ఎన్నికల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండోదశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 73 మంది పీఓ, ఓపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విధులకు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు. నిర్దేషిత గడువులోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూడోవిడతకు ఏర్పాట్లు చేయాలి..
స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఎన్నికలు జరుగనున్న కాటారం, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల రెవెన్యూ, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా 16న పోలింగ్ సామగ్రి పంపిణీ, 17న పోలింగ్, 2 గంటల తదుపరి ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. విధులు కేటాయించిన సిబ్బంది 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
గైర్హాజరైన 73 మందికి షోకాజ్ నోటీసులు
కలెక్టర్ రాహుల్ శర్మ


