శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు
● మద్యం, నగదు పంపిణీపై దృష్టిసారించాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి/కాళేశ్వరం : కాటారం సబ్‌డివిజన్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగొద్దని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. సోమవారం ఆయన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లుతో కలిసి మహదేవపూర్ మండలంలో పర్యటించారు. కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి, పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి భద్రత ఏర్పాట్ౖలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించాలని, నిరంతర తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు.పోలింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సంబురాలు నిర్వహించడం నిషేధించామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు. ఎస్పీతో కాళేశ్వరం, మహదేవపూర్ ఎస్సైలు తమాషారెడ్డి, పవన్‌కుమార్, రెండో ఎస్సై సాయిశశాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


