నేడే రెండో విడత తీర్పు
నాలుగు మండలాల్లో 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు ఎన్నికలు
భూపాలపల్లి అర్బన్: పోలింగ్ సామగ్రిని సరి చూసుకుంటున్న సిబ్బంది
భూపాలపల్లి: రెండో దశ గ్రామపంచాయతీ పోరుకు అంతా సిద్ధమైంది. జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల నాలుగు మండలాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండగా, నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
బరిలో 1,560 మంది అభ్యర్థులు..
భూపాలపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల మండలాల్లో మొత్తం 85 జీపీలు, 694 వార్డులు ఉండగా అందులో 10 సర్పంచ్ స్థానాలు, 147 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 244, వార్డులకు 1,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఒంటిగంటకు ముగుస్తుంది. తదుపరి కౌంటింగ్ నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
విధుల్లో చేరిన పోలింగ్ అధికారులు..
ఎన్నికల నిర్వహణ అధికారులు శనివారమే విధుల్లో చేరారు. ఉదయం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరియల్‌ను తీసుకొని అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టేషన్‌లకు చేరుకొని రాత్రి అంతా సిద్ధం చేసుకున్నారు. ఉదయం ఏడు గంటలకు సజావుగా ఎన్నికల నిర్వహణను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,846 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..
రెండో దశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) 2023 లోని సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, ఓటర్లను ప్రలోభపరిచే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
10 సర్పంచ్, 147 వార్డులు ఏకగ్రీవం
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
నేడే రెండో విడత తీర్పు
నేడే రెండో విడత తీర్పు
నేడే రెండో విడత తీర్పు


