మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో కార్మికులపై మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1వ గనిలో కొంత మంది మైనింగ్ అధికారులు కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులపై అనవసరమైన ఒత్తిడి, అవమానకరమైన ప్రవర్తన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. హాజరు విషయంలో కార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రత్నం అవినాష్, దేవరకొండ మధు, కుమారస్వామి, మల్లారెడ్డి, మొగిలి, రమేష్, పాష పాల్గొన్నారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. భూపాలపల్లి, కాటారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 451 మంది విద్యార్థులకు గాను 314 మంది పరీక్షకు హాజరుకాగా 137 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు.
క్రీడలతో ఆరోగ్యం
ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత
భూపాలపల్లి అర్బన్: క్రీడలు గెలుపోటములకే కాకుండా ఆరోగ్యం, ఉత్సాహానికి ఉపయోగపడతాయని ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళలకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. క్రీడా పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదని, మనలో ఉన్న సహకారం, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఉత్సాహం వంటి విలువలను మరొకసారి మనకు గుర్తు చేస్తాయన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలే అని గెలుపోటములు సహజమన్నారు. ధైర్యం, కలిసికట్టుగా ముందుకు సాగే తపన అదే నిజమైన విజయమని చెప్పారు. సేవ సభ్యులు సేవాభావం, అంకితభావం సంస్థకు, సమాజానికి అమూల్యమైనవని అన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, ఉత్సాహంగా పాల్గొన్న సేవ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పొర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, సేవా కార్యదర్శి రుబీనా, సభ్యులు పాల్గొన్నారు.
మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి


