ఇసుక పనుల్లో మతలబేంటి?
ములుగు: మేడారం జంపన్నవాగులో ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్‌శాఖకు రూ.4.96కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.1.29 కోట్లతో ఇసుక లెవలింగ్ పనులు చేస్తున్నారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నుంచి జంపన్నవాగులోని భక్తుల పుణ్యస్నానాల కోసం నీటిని విడుదల చేస్తారు. రెడ్డిగూడెం నుంచి చిలకలగుట్ట వరకు వాగు సమాంతరంగా ఉండేందుకు ఇసుకను లెవలింగ్ చేస్తున్నారు. ఇసుక చదును పనుల్లో లోపాలు ఉన్నాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఇసుక లెవలింగ్ పనులను సంబంధించిన ఎస్టిమేషన్ పత్రాలను, రికార్డులను ఇరిగేషన్‌శాఖ నుంచి తీసుకున్నట్లు తెలిసింది. వాగులో ఇసుక చదును పనులపై విజిలెన్స్ బృందం శనివారం మేడారానికి వస్తున్నారనే సమాచారం ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారుల నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు మేడారానికి ఇసుక పనులకు సంబంధించిన అన్ని రికార్డులతో మేడారానికి వచ్చినట్లు సమాచారం.
పనులు నిలిపివేత
మేడారం జంపన్నవాగులో ఇసుక చదును పనులను శనివారం నిలిపివేశారు. విజిలెన్స్ బృందం అధికారులు తనిఖీ నిర్వహించేంత వరకు పనులు ఆపేవేయాలని ఆదేశించడంతోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. భక్తుల జల్లు స్నానాల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ నల్లాలను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఇసుక చదును పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల 12న మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలు వచ్చిన సమయంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతోపాటు సమీక్ష సమావేశానికి కొంత ఆలస్యంగా హాజరు కావడంతో మంత్రి ఆగ్రహించినట్లు తెలిసింది.
జంపన్నవాగు ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారుల ఆరా?


