హోరెత్తిస్తున్న మైకులు !
కాళేశ్వరం: మూడో విడత ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువు ఉండడంతో బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని తీవ్రం చేశారు. కాటారం సబ్ డివిజన్‌లోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో సర్పంచ్‌లుగా పోటీచేస్తున్న వారు ఆటోలు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసి మైకులతో హోరెత్తిస్తున్నారు. కాలనీలు, వార్డుల్లో వాహనాలను తిప్పుతూ ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాలినడకన ఓ వైపు ఇంటింటా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు వాహనాల ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాహనాలతో మైకులు అమర్చి ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. పోటాపోటీ ప్రచారంతో ఓటరు ఆలోచనలో పడుతున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 17న మూడో విడతకు పోలింగ్ ఉండగా, 15న సాయంత్రం వరకు ప్రచారానికి తెర పడనుంది. దీంతో మైకుల మోతతో పల్లెలు దద్దరిల్లుతున్నాయి.


