ప్రలోభాలు షురూ..
ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
రెండో విడతలో జరుగనున్న భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో వలస ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి వారు జీవనోపాధి, ఉద్యోగ, ఉపాధి రీత్యా హనుమకొండ, హైదరాబాద్ పట్టణాల్లో నివసిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా గెలుపుపై ప్రభావం చూపనుంది. దీంతో వలస ఓట్లపై ప్రధాన పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు దృష్టి సారించారు. పట్టణాల్లో ఉన్న వారికి రవాణా ఖర్చులతో పాటు ఓటుకు రూ.వేయి నుంచి రూ.1,500 ఇస్తామని చెప్పి.. తప్పకుండా ఓటు వేసేందుకు రావాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ముందస్తుగా ఆన్‌లైన్ పేమెంట్‌లు సైతం చేస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడదను తీరుస్తామని, కుల సంఘాలకు చెందిన దేవాలయాలు నిర్మిస్తామని, ప్రతీ కాలనీకి సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని, అర్హులైన వారికి పింఛన్‌లు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు.
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మొదటి దఫాలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలను కై వసం చేసుకున్నారు. దీంతో రెండో విడతలో అధికార పార్టీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
రేపు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో ఎన్నికలు
గెలుపు కోసం అభ్యర్థుల
పడరాని పాట్లు
ఓటుకు నోటుతో పాటు మద్యం,
చీరలు, వస్తువుల పంపిణీ
గ్రామాల్లో ఎక్కడ చూసినా విందులే
వలస ఓటర్లకు ప్రత్యేక ఆఫర్లు


