రెండో దశ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు 13వ తేదీన పోలింగ్ మెటీరియల్ పంపిణీ, 14వ తేదీన పోలింగ్, ఓట్లు లెక్కింపు తదితర అంశాలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి రెవెన్యూ, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో గ్రామాల వారీగా మూడు భాగాలుగా విభజించి ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ లేని చోట మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ శ్రీలత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి..
రెండో విడత జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 14వ తేదీన జరుగనున్న భూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఓపీలకు శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.
ప్రత్యేక పోర్టల్ రూపకల్పన..
జిల్లాలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణను మరింత సులభతరం చేసి పారదర్శకతను పెంచే దిశగా ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, పంచాయతిరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖలకు ఏ పథకం కింద ఎంత నిధులు కేటాయించబడ్డాయి, ఏ పనులు చేపట్టారు, వాటి పురోగతి ఎంత, పూర్తి చేయాల్సిన గడువు, ప్రారంభం కాని పనులు, కాంట్రాక్టర్ల సమస్యలు, స్థల సంబంధిత ఇబ్బందులు వంటి అన్ని అంశాలను ఒకే వేదికలో సమగ్రంగా పొందుపరుస్తూ పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
అనుమతులు లేకుంటే చర్యలు..
జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్, రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ కిరణ్ పాల్గొన్నారు.
ఓటర్లకు ఇబ్బంది రానివ్వొద్దు
అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు
కలెక్టర్ రాహుల్ శర్మ


