కార్మికులకు ఈఎస్‌ఐ అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ తప్పనిసరిగా అమలు చేయాలని ఈఎస్‌ఐ బ్రాంచ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఏరియాలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకం(ఈఎస్‌ఐ)పై శుక్రవారం స్థానిక జీఎం కార్యాలయంలో కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తప్పనిసరిగా ఈఎస్‌ఐ అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పడులు ప్రయోజనాలు ఉండవని చెప్పా రు. ఈఎస్‌ఐ ఉండటం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కాంట్రాక్టర్లకు కలిగే చట్టపరమైన పరిణామాలు, ఈఎస్ ఐ నిబంధనల ప్రకారం విధించే పెనాల్టీలు, బకాయిల వసూలు, తనిఖీలలో లోపాలు కనబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఏజీఎం రవికుమార్, పీఎం శ్యాంప్రసా ద్, గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
ములుగు రూరల్: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్‌రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్‌రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు.
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. మల్లూరు కేసీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.


