పెద్ద పంచాయతీలే టార్గెట్
రూ.లక్షల్లో డబ్బు, మద్యం..
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
భూపాలపల్లి అర్బన్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో భూములు అమ్ముకుని మరీ పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయ బలం కోసం ఇలాంటి పరిస్థితులు తొలిపోరులో కనిపించాయి. గెలిచిన వారు ఉత్సాహంగా ఉంటే, ఓడినవారు తాము ఖర్చు చేసిన డబ్బును వసూల్‌చేసే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి విడత ఎన్నికలు ధనప్రవాహం కనిపించింది. లక్షలు ఖర్చు పెట్టయినా కొన్ని పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మండలాలుగా ఉన్న గ్రామపంచాయతీల్లో, ఇతర పెద్ద పంచాయతీల్లో ఎలాగైనా గెలవాలని ఇటు పార్టీలతో పాటు అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా తొలివిడత ఎన్నికలే కనిపిస్తున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి ఓడిపోయిన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరికొంత మంది ఓటర్లకు పంచిన డబ్బును వసూలుచేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏకగ్రీవమైనవి దాదాపుగా 19 పంచాయతీలు ఉంటే వాటిలో ఉన్నవన్ని చిన్నపంచాయతీలే కావడం విశేషం. పెద్దపంచాయతీల్లో అందరూ పోటీకే ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదాయం ఉన్న చోటే ఆసక్తి
జిల్లాలో 12 మండలాలు ఉంటే వాటిలోని 11 మండల కేంద్రాలు పంచాయతీలుగానే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పంచాయతీలు ఆదాయం పరంగా, అభివృద్ధి పరంగా ముందున్నాయి. ఈ విధమైన అనుకూలతలు ఉన్న పంచాయతీల్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్‌లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఎక్కువ మొత్తంలో దాఖలయినప్పటికీ చివరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారుల మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు అన్ని మండలకేంద్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం, మల్హర్, దామెరకుంట, చిట్యాల, టేకుమట్ల గొర్లవీడు, చల్లగరిగే వంటి గ్రామపంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. మొదటి విడత ఎన్నికలు జరిగిన గణపురం, చెల్పూర్, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రంగాపూర్ పంచాయతీల్లో తీవ్రమైన ఉత్కఠంలో ఎన్నికలు జరిగి గెలుపు నువ్వా నేనా అనే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్శించాయి. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, దామెరకుంట వంటి పంచాయతీలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అనుకుని ఉండటం, ఇసుక క్వారీలు ఉండటంతో ఈ పంచాయతీలకు విపరీమైన పోటీ నెలకొంది. తాడిచెర్ల పంచాయతీ పరిధిలో జెన్‌కో బొగ్గు గనులు ఉండటంతో పోటీ నెలకొంది. గణపురం, చెల్పూర్ పంచాయతీలు జిల్లా కేంద్రం భూపాలపల్లిని అనుకుని ఉండటం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వంటివి ఉండటంతో ఈ పంచాయతీల్లో గెలిచిన వారి పంట పండినట్లేనని ప్రజలు అనుకుంటున్నారు. దీంతో ప్రధాన పార్టీల మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అన్నింటి కన్నా ముఖ్యంగా అందరి నోళ్లలో నానుతున్న కాళేశ్వరం పంచాయతీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ కూడా పోటీ ఎక్కువగా ఉంది.
ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు
అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ఉన్న గ్రామపంచాయతీల్లో గెలవడానికి ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, తాడిచర్ల వంటి జీపీల్లో లక్షల్లో ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయినప్పటి నుంచే డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మండల స్థాయి నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల కన్నా సర్పంచ్‌గా గెలిచేందుకే మొగ్గు చూపిస్తుండటం విశేషం. గోదావరి పరివాహక గ్రామపంచాయతీల్లో ఇసుక క్వారీలు ఉండటం, దీంతో ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తుందని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. దీంతో ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
తొలి విడతలో అన్ని గ్రామపంచాయతీల్లో ధనప్రభావం కనిపించింది. ముఖ్యంగా పెద్ద గ్రామపంచాయతీల్లో కనీసం రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఈ మొత్తం రెట్టింపు కూడా అయింది. ఉదాహరణకు జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి రూ.50లక్షల దాకా ఖర్చుచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఖర్చుపెట్టి ఓడిపోయిన అభ్యర్థి తన పంచిన డబ్బును వసూలు చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకేంద్రానికి కొద్దిదూరంలో ఉన్న పంచాయతీల్లో ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచిన డబ్బులను వసూలు చేసుకునే పనిలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయంగా పైచేయి సాధించడం కోసం లక్షల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు. తొలివిడతలోనే ఇలా ఉంటే వచ్చే రెండో, మూడో విడత ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు, ప్రజలు అనుకుంటున్నారు.
ఆదాయం, అభివృద్ధి ఉన్న జీపీల్లో గెలవాలని భావిస్తున్న అభ్యర్థులు
తొలి విడతలో పెద్ద పంచాయతీల్లో ధన ప్రవాహం
కొన్ని చోట్ల రూ.50లక్షల దాకా ఖర్చు చేసిన అభ్యర్థులు
పెద్ద పంచాయతీలే టార్గెట్
పెద్ద పంచాయతీలే టార్గెట్
పెద్ద పంచాయతీలే టార్గెట్


