రండీ బాబు.. రండీ!
ఆన్‌లైన్ పేమెంట్స్?
వలస ఓటర్లపై నజర్
కాళేశ్వరం: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ఓటర్లను కిక్కెక్కిస్తుంది. తొలి విడత ఎన్నికలు గురువారంతో ముగిసాయి. ఈనెల 14న రెండో, 17న మూడో విడత ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితోపాటు వార్డుల్లో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్‌తోపాటు చైన్నై, తమిళనాడు, ముంబాయి తదితర ప్రాంతాలు, ఇతర జిల్లాలో ఉన్న తమ గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వలస కూలీలు, సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారిని పోలింగ్ రోజున రప్పించడానికి రవాణా చార్జీలు భ్యర్థులు భరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఓట్లు ఉంటే అంత మొత్తంలో ఖర్చులు భరించడానికి సిద్ధం అవుతున్నారు.
పట్నం ఓటర్లే కీలకం
నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బంధువులు, గ్రామస్తులు ఎవరికి వారే పనుల్లో బిజీ అయ్యారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేశారు. ఓటరు లిస్టువారీగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రాంతానికి ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్‌లో ఉన్న మనోడు వచ్చాడా.. చైన్నై నుంచి బయలు దేరారా’ అనే చర్చలు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఊరి ఓటర్లతోపాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు. ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపై గంపెడాశలు పెట్టుకుంటున్నారు.
ఒక్క ఓటు చాలు..
ఒక్క ఓటు ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితి ఉంది. ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక్క ఓటే పదుల సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. 14న రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, 17న మూడో విడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస వెళ్లిన వారికి సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో వారికి డిజిటల్ పే ద్వారా డబ్బులు పంపుతున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు వారిని పోలింగ్ తేదీ వరకు వచ్చేవిధంగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులైపారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పట్టణాల్లో ఉంటున్నవారికి
అభ్యర్థుల ఫోన్లు
రవాణా చార్జీల చెల్లింపు?
కొనసాగుతోన్న
రెండు, మూడో విడతల ప్రచారం
రండీ బాబు.. రండీ!


