రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం
భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా అడిషనల్ జూనియర్
సివిల్ జడ్జి అఖిల


