ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రజాదివస్‌లో స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంక్తీర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ద్వారా పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వినతులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించేలా సూచనలు జారీ చేశారు.
కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో నిరంతరం వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మందుల నిల్వ, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెగడపల్లి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించారు. డీహెంఎచ్‌ఓ వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి, డీడీఎం మధుబాబు పాల్గొన్నారు.
రేగొండ: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని రూపిరెడ్డిపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు పూర్తికాగానే టాబ్‌లలో ఎంట్రీ చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో కచ్చితత్వం, పారదర్శకత, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ వాల్యనాయక్, ఏసీఎస్‌ఓ వేణు, సివిల్ సప్‌లై ఆర్‌ఐ రాజు, రెవెన్యూ ఆర్‌ఐ భరత్ కుమార్ పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి


