ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
భూపాలపల్లి అర్బన్: జాప్యం లేకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌హాల్‌లో పౌర సరఫరాలు, సహకార, డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 12వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న సందర్భంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరి రాబడి గరిష్ట స్థాయికి చేరుతున్న ఈ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ, ఆలస్యం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీక్ సీజన్ సమయంలో ప్రత్యేక నిఘా బృందాలు ఫీల్డ్‌లో నిరంతరం పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి బాబురావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు(మంగళవారం) ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, డీఈ దేవేందర్ పాల్గొన్నారు.
యంత్రాంగం పటిష్టంగా పర్యవేక్షించాలి
గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు నేడు(మంగళవారం) సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడుతుందని, జిల్లా యంత్రాంగం పటిష్టంగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


