పోలీస్‌శాఖకు అండగా హోంగార్డులు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి అర్బన్: అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు జిల్లా పోలీస్‌శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 104 మంది హోంగార్డులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో స్పందన, బందోబస్తు విధులు, ప్రజా రక్షణ చర్యల్లో హోం గార్డుల సేవలు అమూల్యం అని వివరించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది హోం గార్డులను ఎస్పీ ప్రశంసపత్రాలతో అభినందించారు. ఇటీవల మరణించిన హోంగార్డు శంకర్ కుటుంబానికి రూ.15వేల చెక్కును అందించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్, ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు హోంగార్డులలో శారీరక సామర్థ్యం, మానసికోల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐ నరేష్‌కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ రత్నం, హోంగార్ వెల్ఫేర్ ఆర్‌ఐ పూర్ణచందర్, ఆపరేషన్ ఆర్‌ఐ కాశీరాం, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సంఘం ప్రతినిధి మర్కాల యాదిరెడ్డి, హోం గార్డ్ సిబ్బంది, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


