సర్పంచ్‌లకు 686.. వార్డులకు 1,804
మొత్తం నామినేషన్లు..
కాటారం: గ్రామపంచాయితీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం సెంటిమెంట్ కావడంతోచివరి రోజు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు అందజేశారు. కాటారం సర్పంచ్ స్థానానికి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి భర్త జక్కు రాకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మల్హర్ మండలం దుబ్బపేట గ్రామపంచాయతీ సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాటారం మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలతో పాటు మహదేవపూర్ మండలం అన్నారంలో నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. కాటారం, మహదేవపూర్ నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్, అన్నారం, కాళేశ్వరం నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ సూర్యనారాయణ పరిశీలించారు. చివరి రోజు కాటారం మండలంలో సర్పంచ్ స్థానాలకు 145 నామినేషన్లు, వార్డు సభ్యులకు 378 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా మహాముత్తారం మండలంలో సర్పంచ్ స్థానాలకు 121 మంది, వార్డు స్థానాలకు 336 మంది, మహదేవపూర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 102 మంది, వార్డు స్థానాలకు 308 మంది, మల్హర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 59 మంది, వార్డు స్థానాలకు 198 మంది నామినేషన్లు వేశారు.
మండలం సర్పంచ్ వార్డు సభ్యులు
కాటారం 214 559
మహదేవపూర్ 164 469
మల్హర్ 115 339
మహాముత్తారం 193 437
ముగిసిన మూడో విడత నామినేషన్లు


