కలల సాకారానికి కృషి అవసరం
సృజనాత్మక ఆలోచనలు
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు కలలు కనాలి.. వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 53వ విద్యా, వైజ్ఞానిక సదస్సుకు కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఎన్నో నూతన ఆవిష్కరణలు విద్యార్థుల నుంచి రావాలని ఆకాంక్షించారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసే రైతు సోదరులు విమానాన్ని తయారు చేశారని, ప్రకృతిని, పరిసరాలను గమనించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని విద్యార్థులకు గుర్తుచేశారు. మానవ జీవితంలో సైన్స్ ఎంతో కీలకమని, అది మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశానుసారం జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామని, దీనికి అనుగుణంగా డిసెంబరు 5, 6 తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్‌స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామన్నారు. సైన్స్ ఫెయిర్‌లో 222 సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులు, 77 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. విద్యా వైజ్ఞానిక స్టాళ్లను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్, ఎంపీడీఓ తరుణ్‌ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్
299 ఎగ్జిబిట్ల ప్రదర్శన


