జాతరలో పనిచేయడం సేవగా భావించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్
ఎస్‌ఎస్‌తాడ్వాయి:మేడారం మహాజాతరలో పనిచేసే అధికారులంతా సేవగా భావించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో జాతర విజయవంతంపై సమ్మక్క– సారలమ్మ పూజారులు, గిరిజన అభ్యుదయ సంఘం యువకులతో ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులంతా నిబద్ధతతో పనిచేస్తేనే జాతర విజయవంతం అవుతుందన్నారు. గత పుణ్యం వల్లే ఈ జాతరలో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభిస్తుందని వివరించారు. పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తామని సూచించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జాతరలో 10 వేల మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకరతో సమీక్షించి పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు అంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సంప్రదాయాలను పాటిస్తూ మహాజాతరను విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పస్రా సీఐ దయాకర్, ఎస్‌ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.


