మూడున్నరేళ్లుగా నిధుల్లేవ్!
అస్తవ్యస్తంగా రైతు వేదికలు
కాటారం: రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సేవలను అందించడం కోసం నిత్యం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. 2021లో నిర్మించి ప్రారంభించిన రైతు వేదికల నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి ఏడాది సక్రమంగా నిధులు మంజూరు చేసింది. మూడున్నర ఏళ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు గుదిబండగా మారింది. సొంత ఖర్చులతో వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
క్షేత్రస్థాయిలో సేవలు అందేలా..
ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో వ్యవసాయశాఖ విస్తరణాధికారిని నియమించి రైతువేదికల ద్వారా వ్యవసాయశాఖ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రైతువేదికల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వసతుల ఏర్పాటుతో పాటు స్టేషనరీ, పారిశుద్ధ్యం నిర్వహణ, ప్రతీ మంగళవారం రైతు నేస్తం, రైతు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు హాజరైన రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ ఖర్చుల కింద గత ప్రభుత్వం రూ.9వేలు అందిస్తామని ప్రకటించింది.
నిలిచిన నిధులు..
జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ అధికారులు నెల నెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఈ లెక్క చొప్పున ఒక్కో రైతు వేదికకు నెలకు రూ.9 వేల చొప్పున 42 నెలలకు గాను సుమారు రూ. 3,78 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
అన్నింటి భారం ఏఈఓలపైనే..
రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, ప్రభుత్వ చేపట్టిన రైతునేస్తం ముఖాముఖి కార్యక్రమాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు, స్వీపర్ జీతం వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటినీ తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతుంది. సమావేశం తర్వాత వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఏఈఓలపై పడుతోంది. రైతువేదికల్లో అటెండర్ నుంచి ఏఈఓ వరకు అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతు వేదికల్లో మరమ్మతు పనులు నెలకొనగా నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి.
జిల్లాలోని రైతు వేదికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజురు చేస్తుందేమో చూడాలి.
– బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఏఈఓలపై భారం
తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం పాట్లు
ఇబ్బందులు పడుతున్న
వ్యవసాయశాఖ అధికారులు
మూడున్నరేళ్లుగా నిధుల్లేవ్!


