మహిళదే పైచేయి
● జనరల్ స్థానాల్లో సైతం పోటీ..
● జిల్లాలో మహిళల ఓట్లే అధికం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపు ఓటములతోపాటు ప్రాతినిధ్యం వహించడంలోనూ మహిళలే కీలకంగా మారనున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలకే అగ్రపీఠం దక్కనుంది. చాలా గ్రామపంచాయతీల్లో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారి పాలించే అవకాశం కలగనుంది. మహిళలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో సైతం వారు పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డు స్థానాలు ఉండగా 114 సర్పంచ్, 886 వార్డు స్థానాలను మహిళలకు కేటాయించారు.
50శాతం వరకు రిజర్వేషన్లు
సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు 50శాతం వరకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఓట్ల పరంగానే కాకుండా సీట్లలో కూడా మహిళలే ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 3,02,147 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,54,744.. పురుషులు 1,47,388 మంది ఉన్నారు. 7,356కు పైగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలే కాకుండా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం మహిళలే గెలుపోటములు నిర్ణయించనున్నారు.
జనరల్ స్థానాల్లో మహిళల పోటీ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లోసైతం పోటీ పడుతున్నారు. పురుషులపై మహిళలు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పలు మండలాల్లో ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయగా మిగితా మండలాల్లో కూడా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టేకుమట్ల మండలం వెలిశాల సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించగా నలుగురు పురుషులు పోటీ చేస్తుండగా ఒక మహిళ కూడా నామినేషన్ దాఖలు చేసింది. మహదేవపూర్ మండలం మద్దులపల్లిజనరల్ స్థానంలో బీసీ మహిళ నామినేషన్ వేయనున్నారు.
జిల్లాలో పంచాయతీ స్థానాలు 248
జనరల్ స్థానాలు 134
మహిళలకు కేటాయించిన స్థానాలు 114
మొత్తం వార్డులు 2,102
మొత్తం జనరల్ స్థానాలు 1,216
మొత్తం మహిళా స్థానాలు 886
మహిళదే పైచేయి
మహిళదే పైచేయి


