పారదర్శకంగా ఎన్నికల ఏర్పాట్లు
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడో విడత షెడ్యూల్ నేడు(బుధవారం) ప్రకటించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికల నిర్వహణకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. మొదటి విడతలో నేడు(బుధవారం) నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిందన్నారు. మొదటి దశకు ఈ నెల 11న, రెండో దశకు 14న, మూడో దశకు 17వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ప్రణాళిక శాఖల అధికారులతో రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని, జాతరకు అనుసంధానం చేసే రోడ్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఎవరైనా కాంట్రాక్టర్ పనుల విషయంలో అలసత్వం వహిస్తే వారిని తొలగించి, వేరొక కాంట్రాక్టర్‌తో పనులు పూర్తి చేపించాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు మూడో విడత ఎన్నికల షెడ్యూల్
కలెక్టర్ రాహుల్ శర్మ


