ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావొద్దు
భూపాలపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సివిల్ సప్లయీస్, ట్రాన్స్‌పోర్ట్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, కోఆపరేటివ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు అందుబాటులో ఉండడం లేదని, ట్యాబ్ ఎంట్రీ చేసి నివేదికలు అందించే విషయం ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీటీఓ సంధాని, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్వేలో భాగస్వామ్యం కావాలి..
రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ విజన్ –2047 డాక్యుమెంట్ రూపొందిస్తుందని, ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంటరీ తయారీలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా సిటిజన్ సర్వే చేపట్టారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది నమోదుపై నివేదికలు అందజేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పారదర్శకంగా నామినేషన్ ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ రెండో విడత ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా, అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం భూపాలపల్లి మండల పరిధిలోని కమలాపూర్, ఆముదాలపల్లి, రాంపూర్, గొల్లబుద్ధారం, లంబాడీ తండా (బి), దూదేకులపల్లిలలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ తరుణి ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు సదానందం, అనిల్ కుమార్, ఎంపీఓ నాగరాజు పాల్గొన్నారు.
దివ్యాంగుల క్రీడలు ప్రారంభం
అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలను జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, జిల్లా క్రీడా శాఖ అధికారి రఘు పాల్గొన్నారు
కలెక్టర్ రాహుల్ శర్మ
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావొద్దు


