ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
● అడిషనల్ సివిల్ జూనియర్ జడ్జి అఖిల
భూపాలపల్లి అర్బన్: జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దామని అడిషనల్ సివిల్ జూనియర్ జడ్జి జి అఖిల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జడ్జి అఖిల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా ఎయిడ్స్, లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జడ్జి అఖిల మాట్లాడారు. ఎయిడ్స్ నిర్ధారణ రోగులకు ఏఆర్టీ మందులతో పాటు వారి జీవన విధానంలో మార్పు తీసుకొని రావడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంహెచ్‌ఓ మధుసూదన్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ సెంటర్లతో పాటు గ్రామాల్లో కూడా హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, జిల్లా లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, దిశ డీఎండీఓ సాయికుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్, మారి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సదానందం, ట్రాన్స్ జెండర్ జిల్లా టీం లీడర్ గౌరి పాల్గొన్నారు.


