బుజ్జగింపులు
నామినేషన్ ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు
భూపాలపల్లి అర్బన్: మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. మొదటి రోజు తక్కువగా నామినేషన్లు దాఖలు అయినా.. తర్వాతి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో ఎవరుంటారు.. ఎవరు విత్‌డ్రా చేసుకుంటారనేది ఈనెల 3న తేలనుంది. నిన్న మొన్నటి వరకు బరిలో ఉంటామనుకున్న వారు చివరికి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో కొత్త మొహాలు తెరపైకి వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి మద్దతు పొందుతున్న అభ్యర్థులకు పోటీలో ఉన్న మిగతా వారు ఆడ్డంకిగా మారబోతున్నారు. దీంతో బరిలో నిలిచిన వ్యక్తులతో కొందరు బేరసారాలకు తెరలేపుతున్నారు. పెద్ద గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలుగా ఉన్న గ్రామపంచాయతీలలో గెలుపును పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నడిచిన ధన ప్రభావం నుంచి ఇంకా పల్లెలు బయటపడకపోవడంతో బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు.
పెద్ద గ్రామపంచాయతీలే టార్గెట్
జిల్లాలో మొదటివిడతలో నాలుగు మండలాలు 82 గ్రామపంచాయతీలు, 712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీల్లో గెలుపొందాలని పలు పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ పంచాయతీల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎంతైనా ఖర్చు పెడదాం అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. పెద్ద పంచాయతీల్లో తమ ఉనికి నిలుపుకోవాలని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. తమ పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తిని గెలిపించుకోవడానికి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా గణపురం, చెల్పూర్, రేగొండ, కొత్తపల్లిగోరి, చిన్నకొడెపాక, మొగుళ్లపల్లి, రంగాపూర్, కొడవటంచ పంచాయతీల్లో గెలుపు కోసం ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు.
మొదలైన బుజ్జగింపులు
చాలా రోజుల తర్వాత తమ వర్గానికి రిజర్వేషన్ రావడంతో చాలా మంది అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఎంత ఖర్చయినా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో గ్రామాల్లో ప్రలోబాలకు, బుజ్జగింపులకు తెరలేపారు. ఒకే పార్టీలో ఉంటున్న వారు ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించే ప్రయత్నంలో ఆయా పార్టీల నాయకులు ఉంటున్నారు. ముఖ్యంగా ఒకే వర్గం నుంచి ఇద్దరు బరిలో ఉంటే తమ వర్గపు ఓట్లు చీలకుండా మరొకరు ఉపసంహరించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కొద్దిగా అంగబలం, అర్థబలం ఉన్న వారు ఎంతో కొంత ముట్టజెప్పి నామినేషన్ విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓటర్లు ఉంటారు కాబట్టి ప్రతీ ఓటు కూడా కీలకమని అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా గ్రామంలోని పెద్దమనుషుల, కులపెద్దల మద్దతు కోరుతున్నారు. నిజానికి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయినప్పటి నుంచే పోటీలో ఉండే అభ్యర్థులు విందులు ఏర్పాట్లు చేసి ఓటు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలల్లో విపరీతంగా ఖర్చయిన మాదిరిగానే గ్రామపంచాయతీల్లో ఖర్చు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్దఎత్తున ఖర్చు తప్పకపోవచ్చని చాలా మంది పోటీలో ఉన్న వారు భావిస్తున్నారు. ఇప్పటికై తే నామినేషన్ దాఖలు చేసినా.. మూడో తేదీ తర్వాత ఎంత మంది ఉంటారో తెలియనుంది. కొన్ని చోట్ల ఖర్చులకు భయపడి అవగాహనతో ఏకగ్రీవం వైపు ఆలోచిస్తున్నారు. అధికార పక్షానికి సర్పంచ్, ప్రతిపక్షానికి ఉపసర్పంచ్ అన్న రీతిలో ఏకగ్రీవం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్పంచ్ కాకపోయినా కనీసం ఉపసర్పంచ్ పదవైనా దక్కించుకోవాలని వార్డు మెంబర్లకు గాలం వేస్తున్నారు.
పూర్తయిన మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ
3న తేలనున్న అభ్యర్థులు
ఖర్చుకు జడుస్తున్న క్యాండిడేట్స్
బుజ్జగింపులు
బుజ్జగింపులు


