రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● రెండో విడతకు నేడు నోటిఫికేషన్ జారీ
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య సూచనలు అందించారు. ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ వినియోగం, నామినేషన్ స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు స్టేజ్–2 అధికారులు పర్యవేక్షణ, సమన్వయం, భద్రత, పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, తిరిగి స్వీకరణ వంటి ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఎంపీడీఓలు, స్టేజ్–2 అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ జారీచేయాలి...
రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్, అనంతరం 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసేలా 90306 32608 సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు అందించాలి..
ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి, నకిలీ విత్తనాలపై నిషేధం విధించడానికి, విత్తనాల దిగుమతిని సరళీకరించడానికి మరియు రైతు హక్కులను రక్షించడానికి నూతన విత్తన చట్టం ముసాయిదా ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో నూతన విత్తన చట్టం 2025 ముసాయిదాపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పోలీసు, ఉద్యాన, విత్తన కంపెనీలు, ఇన్పుట్ డీలర్లు, రైతుల ఉత్పత్తి సంఘాలు అనుబంధ సంస్థలు, రైతులతో అభిప్రాయ సేకరణ చర్చా సదస్సుకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నరేష్‌కుమార్, డీఏఓ బాబూరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునిల్‌కుమార్, ఏడీఏలు పాల్గొన్నారు.


