నో డ్యూ మస్ట్!
మొగుళ్లపల్లిలో
రూ. 97,600 వసూలు..
ఇంటి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్న ఆశావహులు
కాళేశ్వరం: ఒరేయ్ ఎంకన్న నీ ఇంటిపన్ను కడుతారా.. అరే మామ నీ కరంటు బిల్లు మొత్తం క్లియర్ చేస్తా .. అరే బామ్మర్ధి బ్యాంకులో ఎంతో కొంత అ ప్పు ఉన్నా.. నేను చెల్లిస్తా రా అంటూ గ్రామాల్లో ఓటర్ల వెంట అభ్యర్థులు పడుతున్నారు. నామినేషన్ కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో మొండి బకాయిలు పలు చోట్ల వసూలు అవుతున్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే వారికి నామినేషన్ పత్రాలతో పాటు ధృవ పత్రాల సమర్పణ తలనొప్పిగా మారింది. అన్ని సర్టిఫికెట్లు సమకూర్చుకునేందుకు నాయకులు హైరానా పడుతున్నారు. నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సమర్పణకు అతి తక్కువ సమయం ఉంది. వివి ధ పత్రాల కోసం కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. లోకల్ బ్యాంకులో కొత్త ఖాతాతో పాటు అప్పులు లేనట్టు నో డ్యూ సర్టిఫికెట్ కూడా అవసరం కావడంతో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నామినేషన్ పత్రం దాఖలు చేసేటప్పుడు ఈసీ విధించిన నిబంధనలు పాటించాలి. సూచించిన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఏ ఒక్కటి మిస్సయినా నామినేషన్ తిరస్కరణకు గురువుతుంది. అభ్యర్థులు అన్ని పత్రాలను సేకరించడంతో పాటు బకాయిలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
మొత్తం కట్టుడే..
నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు వారిని బలపరిచేవారికి అప్పులు, బకాయిలు ఉండొద్దు. వారి పేరిట గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు మొత్తం చెల్లించేస్తున్నారు. వారిని బలపరిచే వారి పన్నులు అభ్యర్థులే కట్టేస్తున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి అవసరం పడకపోవడంతో పన్నుల చెల్లింపులకు మొండికేసిన వారున్నారు. అలాంటి వారు దేవుడా అంటూ మొత్తం కట్టేస్తున్నారు. అభ్యర్థి పేరిట ఉన్న ఇంటి కరెంటు బిల్లు కూడా పూర్తిగా చెల్లించి బాకీ లేనట్టు పత్రం జతచేయాలి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే వారు పదుల సంఖ్యలో ఉండగా వారిని బల పరిచేవారు సైతం బిల్లులు క్లియర్ చేస్తున్నారు. బ్యాంకుల్లోని పాత అప్పులు చెల్లించడం, వడ్డీ కట్టి రిన్యూవల్ చేసుకొని అప్పులేనట్టు ధృవపత్రం తీసుకుంటున్నారని తెలిసింది. ఎన్నికల పుణ్యమా అని ఇంటి పన్ను బకాయిలు, కరెంటు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి.
జిల్లాలో ఇలా:
మొదటి విడతలో నాలుగు మండలాలు, 82 పంచాయతీలు,712 వార్డులకు నామినేషన్‌ల స్వీకరణ జరుగుతుంది. రెండవ విడతలో నాలుగు మండలాలు, 85పంచాయతీలు, 694 వార్డులు, మూడో విడతలో నాలుగు మండలాలు, 81 పంచాయతీలు, 696 వార్డులు ఉన్నాయి. వీటిలో రెండు, మూడు విడతల్లో ఇంకా నామినేషన్‌లు ప్రారంభం కావలసి ఉంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా అన్నీ జీపీల్లో కొన్ని నెలలుగా పంచాయతీలకు నిధులు రాక సిబ్బంది జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉన్న సమయంలో ఈ పన్నుల వసూలు కాస్త ఊరట కలిగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్‌ను సంప్రదించగా ప్రతి ఒక్కరు నోడ్యూస్ సర్టిఫికెట్‌తో నామినేషన్‌కు రావాలి. నోడ్యూస్ లేని వారి నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని తెలిపారు.
మొగుళ్లపల్లి మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 212 వార్డులు ఉన్నాయి. శనివారం వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా శుక్రవారం వరకు సర్పంచ్ స్థానాలకు 37, వార్డు స్థానాలకు 85 నామినేషన్లు వచ్చాయి. అయితే సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలవనున్న అభ్యర్థులను మరొకరు బలపరచాల్సి ఉంటుంది. పోటీలో నిల్చొనే అభ్యర్థి నామినేషన్ ఫీజుతో పాటు, అతడి, బలపరిచే ఓటరు ఇంటి పన్ను పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఒక్క మండలంలోనే నామినేషన్ల రూపంలో గురు, శుక్రవారాల్లో సుమారు రూ. 76 వేలు వచ్చాయి. ఇంటి పన్ను బకాయిలు రూ. సుమారు 97,600 వరకు వసూలు అయ్యాయి. చివరి రోజు(నేడు) నామినేషన్ల సంఖ్య పెరిగి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే లోపు జిల్లాలోని పంచాయతీల్లో పాత బకాయిలు వసూలు అయి గల్ల పెట్టె గలగల అనబోతుందని తెలుస్తోంది.
బ్యాంకుల్లో పాత అప్పులు కూడా క్లియర్
నామినేషన్‌కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి
కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ పరుగులు
నిండుతున్న ఖజానా
నో డ్యూ మస్ట్!


