పోలీసుల విధులపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి: పోలీసుల విధులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు, గంజాయి వాడకంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నియమాలు, భరోసా, షీ టీమ్, సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్ విభాగం, డాగ్ స్క్వాడ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఎలా ఇవ్వాలి, విచారణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే విషయాలను వివరించారు. కొన్ని సాంకేతిక పరికరాల వినియోగాన్ని ప్రాక్టికల్ డెమో రూపంలో చూపించారు. డయల్ 100 విధానం, కాల్ అందిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తారో వివరించడంతో పాటు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆయుధాలు, పోలీస్ చట్టాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యం, ఫింగర్ ప్రింట్ పరికరాలు, ట్రాఫిక్ సేఫ్టీ, సైబర్ భద్రత వంటి అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ డి.నరేష్‌కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే


