భయం గుప్పిట్లో అటవీ గ్రామాలు
● చిరుత పులి సంచారంతో
ఆందోళనలో ప్రజలు
కాటారం: చిరుతపులి సంచారంతో కాటారం, మహాముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల్లో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మికంగా చిరుత పులి ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మహాముత్తారం మండలం జీలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పర్లపల్లి గ్రామ సమీపంలో గొర్రెల మందపై శనివారం తెల్లవారుజామున చిరుత దాడి చేసి రెండు గొర్రెలను చంపివేసిన విషయం విదితమే. అకస్మాత్తుగా చిరుతపులి దాడికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత గ్రామానికి సమీపం నుంచి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. దీంతో చిరుతపులి ఈ అటవీప్రాంతంలోనే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రైతులు, పశువుల కాపర్లు, ప్రజ లు అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు.
కాటారం రేంజ్ పరిధిలోనే పులి సంచారం..
మహాముత్తారం మండలం పర్లపల్లిలో దాడికి పాల్పడిన చిరుతపులి ప్రస్తుతం కాటారం అటవీశాఖ రేంజ్ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జీలపల్లి అటవీ ప్రాంతం నుంచి కాటారం మండలం ప్రతాపగిరి అడవుల్లోకి చిరుత ప్రవేశించి ఉంటుందని చర్చ జరుగుతుంది. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వర్షం కురవడంతో అటవీ ప్రాంతంలో ఆనవాళ్లు, పాదముద్రలు పూర్తి స్థాయిలో కానరావడం లేదు. దీంతో పులి ఎటు నుంచి ఎటు వెళ్లిందనే స్పష్టత రావడం లేదు. అసలు చిరుత ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంత కాలం నుంచి ఈ అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుందనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. చిరుతపులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాటారం రేంజ్ అధికారి స్వాతి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేకంగా వాల్‌పోస్టర్లు తయారు చేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి పూట రైతులు, కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని పులికి హాని తలపెట్టే కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎఫ్‌ఆర్వో స్వాతి హెచ్చరించారు.


