
కార్మికుల సమస్యలు పట్టవా?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు సింగరేణి అధికారులకు పట్టవా? అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య ఆరోపించారు. ఏరియాలోని రామప్ప కాలనీలో రెండు నెలల నుంచి పేరుకుపోయిన చెత్త కుప్పులను కాలనీవాసులతో పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ నెలల తరబడి కాలనీలో చెత్త కుండీల్లో కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని మండిపడ్డారు. చెత్త కుళ్లిపోవడంతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామన్నారు. తక్షణమే పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లించి, దోమల మందు పిచికారీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాలనీ వాసులు మహేందర్, రాజు, రమేశ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజయ్య