
దిగుబడి కష్టమే!
జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు
భూపాలపల్లి: ఈ ఏడాది వానాకాలం సీజన్ రైతులకు అనుకూలించడం లేదు. విత్తనాలు నాటే సమయంలో వరణుడు కరుణించకపోవడం, పంటలు మొక్కదశలో ఉండగా అకాల వర్షాలు కురుస్తుండటంతో దెబ్బతింటున్నాయి. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి రైతుల దిగాలు..
జిల్లాలో 12 మండలాల్లోని రైతులు 96 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాగా గతేడాది మిర్చి పంటలో నష్టాలు చవిచూసినందున, ఈ ఏడాది అధికారుల అంచనాకు మించి 98,260 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. కాగా పత్తి గింజలు నాటిన సమయంలో అంతంత మాత్రంగానే వర్షాలు కురియడంతో మొలకలు కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా ఎదగగా ఈ క్రమంలోనే వర్షాలు కురుస్తుండటంతో పూత, కాత రాలుతోంది. అంతేకాక కలుపు విపరీతంగా పెరుగగా, వరుస వర్షాల కారణంగా కూలీలతో కలుపు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా దిగువ ప్రాంతాల్లోని భూముల్లో వేసిన పత్తిపంట పూర్తిగా ఎర్రబారిపోయింది. మిర్చి పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నెలరోజుల క్రితం మిర్చి మొక్కలు నాటిన భూముల్లో కలుపు విపరీతంగా పెరుగగా, వర్షాల కారణంగా తీయలేని పరిస్థితి నెలకొంది. పక్షం రోజుల క్రితం నాటిన మొక్కలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది.
కూరగాయల సాగు ఆలస్యం...
ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రోజు విడిచి వర్షాలు కురుస్తుండటంతో కూరగాయల సాగు ఆలస్యం కానుంది. జిల్లాలో సుమారు 250 నుంచి 300 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగనుండగా ఇప్పటి వరకు రైతులు సాగు పనులు ప్రారంభించలేదు. దీంతో టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్, వంకాయ, బెండకాయ తదితర కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కాటారం మండలం గంగారంలో ప్రతీఏటా 50 నుంచి 60 ఎకరాల్లో ఆకుకూరల సాగు జరుగుతుండగా ఇప్పటి వరకు అక్కడి రైతులు సాగు అంతంత మాత్రమే ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆకుకూరల గింజలు మురిగిపోవడం, పంటలకు చీడలు సోకే అవకాశం ఉన్నందున ఇంకా పెద్దమొత్తంలో సాగు ప్రారంభించలేదు. వర్షాభావ పరిస్థితులను గమనించి ఈ నెల చివరి వారంలో ఆకుకూరలు, కూరగాయలను రైతులు సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పత్తి, మిర్చి, కూరగాయల
పంటలపై ప్రభావం
పత్తి పంటలో రాలుతున్న పూత, కాత
ఆందోళనలో పత్తి రైతులు
జిల్లాలో 98,280 ఎకరాల్లో
పత్తి సాగు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తాడిచర్లకు చెందిన పెంచాల మల్లయ్య. ఈయనకున్న ఎకరంన్నరతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నాడు. నిన్న, మొన్నటి వరకు యూరియా కొరత, ఇప్పుడు వరుస వర్షాలతో పత్తి పంట పూర్తిగా ఎర్రబారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూత, కాత రాలిపోతుందని, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు. దిగుబడి 30 శాతం వరకు వ స్తుందని, అది కూడా పత్తి నాణ్యత లేక ధర తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.

దిగుబడి కష్టమే!

దిగుబడి కష్టమే!