
యూరియా కోసం ఆందోళన
కాటారం: మండలకేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. యూరియా నిల్వ ఉన్నప్పటికీ మన గ్రోమోర్ నిర్వాహకులు సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. గ్రోమోర్ సెంటర్‌కు శుక్రవారం యూరియా బస్తాలు రాగా నిర్వాహకులు పలువురు రైతులకు స్లిప్‌లు ఇచ్చారు. మరుసటి రోజు బస్తాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. దీంతో శనివారం రైతులు గ్రోమోర్ కేంద్రానికి రావడంతో ఆర్డర్ ఇంకా రాలేదని తర్వాత పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కావాలనే యూరియా పంపిణీ చేయడం లేదని రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు గ్రోమోర్ కేంద్రం వద్దకు చేరుకొని రైతులకు యూరియా బస్తాలు ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది.