
భారీ వర్షం.. ఉధృతంగా వాగులు
వాజేడు/వెంకటాపురం(కె)/కన్నాయిగూడెం: ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాజేడు మండల పరిధిలోని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మిర్చి తోటలు ముంపునకు గురయ్యాయి. బోదెబోయిన నానబాబుకు చెందిన 1.5 ఎకరాల్లో వేసిన మిర్చి పంట మునిగినట్లు తెలిపారు. జంగాలపల్లికి చెందిన రుద్ర సత్యనారాయణ, రుద్ర నారాయణ బాబులది చెరో అరెకరం మిర్చి పంట నీట మునిగినట్లు నారాయణ బాబు తెలిపారు. వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్, అప్పాలవారి వీధి, శివాలయం వీధులలో డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వర్షం నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడ్డారు.