
8 నెలలుగా జీతాల్లేవు..
● అతిథి అధ్యాపకులకు అందని వేతనాలు
● ప్రభుత్వ జూనియర్ కళాశాల
గెస్ట్ లెక్చరర్ల అవస్థలు
● కరువైన ఉద్యోగ భద్రత
కాటారం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఎనిమిది నెలల వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు నెలలవి, ఈ విద్యాసంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది నెలల వేతనాలు అందకపోవడంతో అతిథి అధ్యాపకులు అర్ధాకలితోనే విద్యా బోధన చేస్తున్నారు. జిల్లాలో 16 మంది ఉన్నారు.
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు ఉన్నాయి. 1,000మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 16మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. నెలకు 72 పీరియడ్లకు తగ్గకుండా రూ.28,080 చెల్లిస్తున్నారు. అతిథి అధ్యాపకులకు నెలకు రూ.42వేలు చొప్పున ఇవ్వడంతో పాటు 12 నెలల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో పని చేస్తున్న 16 మంది అతిథి అధ్యాపకుల్లో ఇంకా ఇప్పటి వరకు 7 మందికి రెన్యూవల్ ప్రొసీడింగ్ కూడా ఇవ్వలేదు. అంటే వీరి ఉద్యోగాలకు భద్రత లేనట్టే. తమ ఉద్యోగాలు ఉంటాయో లేదో అనే సంశయంలో రెన్యూవల్ కానీ గెస్ట్‌లెక్చరర్స్ సతమతమవుతున్నారు.
జేఎల్ నియామకంతో చిక్కులు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న చోట త్రిమెన్ కమిటీ ద్వారా గెస్ట్ లెక్చరర్లను నియమించారు. దశాబ్దకాలంగా ప్రభుత్వం సంవత్సరానికి పది నెలల వేతనం చెల్లిస్తూ రెన్యూవల్ చేస్తూ వచ్చింది. గత సంవత్సరం చివరలో కొత్త జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వం రిక్రూట్ చేసింది. దీంతో జిల్లాలోని ఆరుగురు అతిథి అధ్యాపకులకు రెన్యూవల్ కాకా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
జీతాలు రాక ఇబ్బంది పడుతున్నాం..
ఎనిమిది నెలలకు సంబంధించిన జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. బోధనపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమవతోంది. అప్పులు చేసి కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
– సిద్దం పిన్నయ్య, గెస్ట్ లెక్చరర్
హామీలు నెరవేర్చాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నెలకు జీతం రూ.42వేలు ఇవ్వడంతో పాటు 12 నెలల జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీల ద్వారా మా జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపడ్డాం. ఇప్పటివరకు హామీలు కార్యరూపం దాల్చలేదు. మాపై దయ చూపి మా సమస్యలను పరిష్కరించి హామీలను అమల్లోకి తీసుకురావాలి.
– సమ్మయ్య, గెస్ట్ లెక్చరర్స్ సంఘం నాయకులు
●

8 నెలలుగా జీతాల్లేవు..

8 నెలలుగా జీతాల్లేవు..

8 నెలలుగా జీతాల్లేవు..